తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఆదివారం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మోదీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ అనుమతులు, నిధుల కేటాయింపు తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారం త్వరితగతిన అందిస్తున్నామని సీఎం వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించండి
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తు వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన సమావేశం వివరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు అవసరమైన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి
డాక్టర్ ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినప్పటికీ పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. దీంతో ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఆలస్యం లేకుండా అవసరమైన అనుమతులు మంజూరయ్యేలా చూడాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు.
సాస్కీ కింద మరో రూ.5 వేల కోట్లు కోరిన సీఎం
స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. 70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులను వినియోగిస్తామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. తద్వారా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతాయని పేర్కొన్నారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, గ్రామాలను గుర్తించేందుకు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్), బ్యాక్‌వాటర్ స్థాయిల ఆధారంగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు రూ.9.88 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) త్వరగా వచ్చేలా చూడాలని ప్రధానిని కోరారు.






