జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (టీజేఏ) నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం వ్యవస్థాపకులు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం సంఘం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నూతన కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా కాసీంను నియమించారు.
ఈ సందర్భంగా ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు, రైల్వే పాసులు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని, ప్రతి జిల్లాలో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని నాయకులకు సూచించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు వంగ రాజు, జిల్లా అధ్యక్షుడు సొల్లేటి ఆంజనేయులు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషవేణి లింగమూర్తి పాల్గొన్నారు.
టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకటరమణ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. గోరి, ఎన్యూజే (ఐ) వైస్ ప్రెసిడెంట్ రాజ్నాథ్, రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, వివిధ జిల్లాల నాయకులు హాజరయ్యారు.







