కత్తరశాల గ్రామ సర్పంచ్ భర్త చెన్నూరు జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేస్తూ అద్దెకిస్తున్నారని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలకు నిలయంగా పేరున్న చౌరస్తాలోనే కత్తరశాల సర్పంచ్ భర్త యదేశ్చగా షెడ్లు ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సర్పంచ్ భర్త అధికారపార్టీకి చెందినవాడు కావడంతో మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తూ అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
నిరుపేద మహిళ షెడ్డు తొలగింపు
ఇటీవల కత్తరశాలకు చెందిన ఓ మహిళ అదే ప్రాంగణంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా, రాత్రికి రాత్రే ఆమె షెడ్డును తొలగించి సామాగ్రిని ధ్వంసం చేశారు. దీనితో సర్పంచ్ తీరుపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, నిరుపేద మహిళకు అండగా నిలిచి సర్పంచ్ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.
అయినప్పటికీ, వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోని సర్పంచ్ భర్త జాతీయ రహదారిపై షెడ్లు ఏర్పాటు చేస్తూ అద్దెలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారపార్టీ నాయకుడి ముసుగులో జాతీయ రహదారిని కబ్జా చేస్తూ, అక్రమ షెడ్ల నిర్మాణం చేపడుతూ చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్న సర్పంచ్ భర్త వ్యవహారం సమంజసం కాదని, ప్రమాదాలకు నిలయంగా పేరున్న జాతీయ రహదారి చౌరస్తాలో ఆయన ఏర్పాటు చేసిన అక్రమ షెడ్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






